
D Educt: Aug 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయించింది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వివిధ దశల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. గతంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల సమయంలోనూ మైనార్టీ అభ్యర్థులకు ఇదే విధంగా ఉచిత శిక్షణ అందించారు. ఈ శిక్షణ ద్వారా వేలాది మంది మైనార్టీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
సీఈడీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ శిక్షణ
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ కోచింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు అధికారికంగా విడుదలైన వెంటనే శిక్షణకు సంబంధించిన కార్యాచరణ, షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.
గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. తొలి దశలో కొన్ని పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల కాగా, మిగిలిన దశల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అర్హత కలిగిన మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నాలుగు దశల్లో నోటిఫికేషన్లు, పరీక్షలు
ప్రభుత్వం విడుదల చేసిన తాజా జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తం నాలుగు విడతల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 పోస్టులు ఉన్నాయి. విద్యాశాఖలో 3 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సెప్టెంబర్ 15న రెండో దశ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో 3,021 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15న మూడో దశ కింద 2,311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నాలుగో దశ కింద డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు కృషి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
