
D Educt: Aug 21: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. స్టైఫండ్ పెంపు డిమాండ్‌పై ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న రెసిడెంట్ (Junior Doctors) డాక్టర్లు, ఇంటర్న్స్, పీజీ విద్యార్థులు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిమాండ్ల పరిష్కారం కోసం అత్యవసర సేవలను సైతం బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ రివిజన్ అమలు చేయాలని డిమాండ్
గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ రివిజన్‌ను వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్ల సంఘం (APJUDA) డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్‌ను 15 శాతం మేర పెంచాలని జూడాలు కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 15 శాతం మేర భారీ పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున పరిమిత శాతంలో వార్షిక ఇంక్రిమెంట్లు లేదా తక్కువ స్థాయిలో స్టైఫండ్ పెంపు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలను జూడాలు తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.
చర్చలు సఫలం కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. జూనియర్ డాక్టర్లు, ఇంటర్న్స్, పీజీ విద్యార్థులు సమ్మెలో పాల్గొనడంతో రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అవసరమైన చోట సీనియర్ డాక్టర్లతో పాటు ప్రైవేట్ వైద్యుల సేవలను కూడా వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు.
స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు, రోగులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. మరోవైపు అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రోగులు అభిప్రాయపడుతున్నారు.
