
D Educt: Aug 17: దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026ను అధికారికంగా ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ఈ స్కాలర్షిప్ ఉపయోగపడనుంది.
ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) విభాగం ఈ పథకం కోసం రూ.130 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. దేశవ్యాప్తంగా మొత్తం 36,428 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి వరకు వివిధ స్థాయిల్లో ఈ ఆర్థిక సహాయం అందించనున్నారు.
చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా పొందవచ్చు. స్కాలర్షిప్కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబర్ 4, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం.. అవసరమైన పత్రాలు
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా పోర్టల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ కావాలి. అనంతరం సంబంధిత స్కాలర్షిప్ ఆప్షన్ను ఎంచుకుని అడిగిన వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
దరఖాస్తు సమయంలో గత ఏడాది పరీక్షల్లో సాధించిన మార్కుల వివరాలు, ఆధార్ కార్డు, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రసీదు, తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి. కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యాసంస్థ బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా గుర్తింపు కార్డును కూడా అప్లోడ్ చేయాలి. విద్యార్థి ఇటీవల తీసుకున్న ఫొటోను కూడా స్కాన్ చేసి సమర్పించాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలు
9వ తరగతి నుంచి పై స్థాయిలో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. గత పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు లేదా 7 సీజీపీఏ సాధించి ఉండాలి. పాఠశాల విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. కళాశాల విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కుల విషయంలో 10 శాతం సడలింపు కల్పించినట్లు పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హత కలిగిన విద్యార్థులు కూడా ఈ ఆర్థిక సహాయం పొందేందుకు అవకాశం ఉంది.
చదువు స్థాయిని బట్టి స్కాలర్షిప్
అర్హత సాధించిన విద్యార్థులకు వారి చదువు స్థాయిని బట్టి ఆర్థిక సహాయం అందించనున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు రూ.15 వేల వరకు స్కాలర్షిప్ అందుతుంది. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు రూ.75 వేల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది.
పీజీ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు రూ.1.5 లక్షల వరకు సహాయం అందించనున్నారు. వైద్య విద్య, ఐఐటీ చదువుతున్న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ప్రతిష్టాత్మక ఐఐఎం విద్యార్థులకు ఏకంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
అదేవిధంగా GRE, GMAT, MCAT, LNAT, LSAT వంటి పరీక్షలకు సంబంధించిన కోర్సులు చేస్తున్న విద్యార్థులకు రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్ అందించే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తులు
స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 4, 2026 చివరి తేదీగా పేర్కొన్నారు. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన విద్యార్థుల జాబితాను అధికారులు రూపొందిస్తారు. అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఉన్నత విద్యను కొనసాగించేందుకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
