
D Educt: Aug 14: యువతకు గుడ్‌న్యూస్.. రెండున్నరేళ్లలో 91,163 మందికి నైపుణ్య శిక్షణ
రాష్ట్ర ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ (సీడాప్) ద్వారా రాబోయే రెండున్నరేళ్లలో 91,163 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆగస్టు 13న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో 2020-21లో సీడాప్ ద్వారా కేవలం 7,200 మంది విద్యార్థులకు మాత్రమే శిక్షణ అందించినట్లు దీపక్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
వచ్చే రెండున్నరేళ్లలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వం అదనంగా రూ.1,022 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో పాటు సీడాప్, న్యాక్ తదితర సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకు ఆయా సంస్థల ద్వారా మొత్తం 7.28 లక్షల మంది యువతకు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ అందించినట్లు దీపక్ రెడ్డి వెల్లడించారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ప్రభుత్వం పలు రకాల సౌకర్యాలను కూడా కల్పిస్తోందని తెలిపారు.
రవాణా, యూనిఫాం, స్టడీ మెటీరియల్, ఆహారం, వసతి, పరీక్ష ఫీజులు, సర్టిఫికేషన్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే యువతకు కూడా నైపుణ్య శిక్షణ పొందేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందే యువతకు కూడా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని తెలిపారు. ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారికి వసతి, మార్గదర్శకత్వం కల్పిస్తున్నామని చెప్పారు.
ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా యువత పరిస్థితిని పర్యవేక్షించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు దీపక్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగంలో చేరిన అనంతరం ఆరు నెలల పాటు వారి పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
