
D Spiritual: Aug 12: ఆగస్టు 13 నుంచి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి మొదలుకానుంది. సెప్టెంబర్ 11 వరకు కొనసాగనున్న ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, శ్రావణ శుక్రవారం వ్రతాలు వంటి అనేక మంగళకర కార్యక్రమాలు నిర్వహించేందుకు పంచాంగకర్తలు, పురోహితులు ముహూర్తాలను నిర్ణయించారు. ముఖ్యంగా ఆగస్టు 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 3, 4, 5, 8, 10 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ శ్రావణ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శ్రావణ మాసంలో వరుసగా శుభ ముహూర్తాలు ఉండటంతో కళ్యాణ మండపాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, పురోహితులకు భారీగా డిమాండ్ పెరిగింది. చాలామంది కుటుంబాలు ముందుగానే మండపాలు, క్యాటరింగ్ సేవలను బుక్ చేసుకుంటున్నారు. దీంతో వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల వ్యాపారాలు, పూల మార్కెట్లు కూడా ఇప్పటికే సందడిగా మారాయి.
ఆషాఢ మాసంలో శుభకార్యాలకు కొంత విరామం రావడంతో, శ్రావణ మాసం ప్రారంభంతో మరోసారి ముహూర్తాల సందడి మొదలుకానుంది. వివాహాలు, ఇతర మంగళకర కార్యక్రమాల ఏర్పాట్లతో కుటుంబాలు బిజీగా మారుతున్నాయి. శుభకార్యాలతో పాటు పూజలు, వ్రతాలతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.
