
ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపాయి. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం, అల్పపీడనం ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో వాతావరణం ఇలా
తెలంగాణలోనూ వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
