
వికారాబాద్, ఆగస్టు 12: రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నకిలీ ఎరువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రైతులు నకిలీ డీఏపీ ఎరువును గుర్తించి వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు నమూనాలను వరంగల్‌లోని ఎఫ్సీవో (FCO – Fertilizer Control Order) ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు.
ల్యాబ్ పరీక్షల్లో నకిలీ డీఏపీ తయారీపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెలువడే ఫ్లైయాష్‌తో పాటు ఉప్పు ద్రావణాన్ని ఉపయోగించి ఈ నకిలీ ఎరువును తయారు చేస్తున్నట్లు ఎఫ్సీవో అధికారులు గుర్తించారు. అంతేకాకుండా బస్తాల్లో ఫ్లైయాష్‌ను నింపి కేవలం వాసన వచ్చేలా రసాయనాలను కలిపినట్లు పరీక్షల్లో వెల్లడైంది.
నాణ్యతా ప్రమాణాల ప్రకారం డీఏపీలో 18 శాతం నైట్రోజన్ 46 శాతం ఫాస్పరస్ ఉండాలి. అయితే వికారాబాద్‌లో పట్టుబడిన నకిలీ డీఏపీ నమూనాల్లో నైట్రోజన్ కేవలం 1.12 శాతం, ఫాస్పరస్ 0.77 శాతం మాత్రమే ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీంతో ఈ ఎరువును పూర్తిగా నాన్స్టాండర్డ్గా ఎఫ్సీవో ల్యాబ్ నిర్ధారించింది.
మరోవైపు నకిలీ డీఏపీ మార్కెట్లో పెద్ద ఎత్తున చలామణి అయినప్పటికీ ఈ వ్యవహారంలో కేవలం ఇద్దరిపైనే పోలీసులు కేసు నమోదు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం కూడా విమర్శలకు దారితీస్తోంది. నకిలీ ఎరువుల దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నకిలీ డీఏపీ కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాయి.
