
D News: Aug 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, నిరుపేదలకు అందిస్తున్న ‘చేయూత’ సామాజిక పింఛన్ల పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి అర్హత, అనర్హత మార్గదర్శకాలను విడుదల చేసింది. అనర్హులను తొలగించి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పింఛన్ ప్రయోజనం అందించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను రూపొందించింది. ఈ పథకం కింద కొత్తగా పింఛన్ పొందాలనుకునే అర్హులు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం నిర్ణయించిన పరిమితిని మించితే చేయూత పింఛన్‌కు అర్హత ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు. ఈ పరిమితిని దాటిన కుటుంబాలను అనర్హులుగా పరిగణిస్తారు.
అలాగే కుటుంబానికి 3 ఎకరాలకు పైగా మాగాణి లేదా సాగు భూమి ఉన్నా, 7.5 ఎకరాలకు పైగా మెట్ట లేదా పొడి భూమి ఉన్నా పింఛన్‌కు అర్హత ఉండదు. భూమి వివరాలను పరిశీలించిన అనంతరం లబ్ధిదారుల అర్హతను అధికారులు నిర్ణయిస్తారు.
కుటుంబంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు, వృత్తి నిపుణులు ఉన్నా పింఛన్‌కు అనర్హులుగా గుర్తిస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణులు ఉన్న కుటుంబాలకు కూడా కొత్త పింఛన్ మంజూరు చేయరు. అదేవిధంగా భారీ వ్యాపారాలు నిర్వహించే కుటుంబాలు, ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులు కావు.
కుటుంబంలో సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా చేయూత పింఛన్ పొందే అవకాశం ఉండదు. కారు, ట్రాక్టర్, వ్యాన్ వంటి నాలుగు చక్రాల వాహనాలు కలిగిన కుటుంబాలను అనర్హులుగా పరిగణిస్తారు.
చేయూత పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత కలిగిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం అవసరమైన ఆదాయ, భూమి, గుర్తింపు పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలి.
