ఫ్లాష్ పాయింట్ పరీక్షలో విఫలమైన ఇథనాల్-బ్లెండెడ్ డీజిల్.. సాంకేతిక సమస్యలు పరిష్కరించే వరకు అమలు కష్టమే

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న కేంద్ర ప్రభుత్వ ఈ-20 విధానానికి ఊహించని సాంకేతిక అవరోధం ఎదురైంది. డీజిల్‌లో ఇథనాల్ కలిపే ప్రయోగాలు ప్రాథమిక పరీక్షల్లో విఫలమైనట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ముఖ్యంగా ఇంధన భద్రతకు కీలకమైన ‘ఫ్లాష్ పాయింట్’ పరీక్షలో మిశ్రమం ఆశించిన ప్రమాణాలను అందుకోలేకపోయినట్లు వెల్లడించారు.

ఫ్లాష్ పాయింట్ పరీక్షలో సమస్య

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తమ పరిశోధనా కేంద్రాల్లో వాహన తయారీ సంస్థలు, గుర్తింపు పొందిన ప్రయోగశాలల సహకారంతో పరీక్షలు నిర్వహించాయి. డీజిల్‌లో ఇథనాల్ కలిపినప్పుడు ఫ్లాష్ పాయింట్ స్థాయి గణనీయంగా తగ్గినట్లు పరీక్షల్లో తేలింది. ఫలితంగా ఇంధన దహన సామర్థ్యం, ఇంజిన్ పనితీరు, భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వ్యవసాయం, ఆహార భద్రతపై ఆందోళనలు

ఇదిలా ఉండగా, ఇథనాల్ ఉత్పత్తికి వ్యవసాయ పంటలను ఎక్కువగా వినియోగించడం వల్ల భూ వినియోగం, ఆహార భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని పర్యావరణ, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మొక్కజొన్న విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. గతంలో భారత్ మొక్కజొన్నను ఎగుమతి చేయగా, ప్రస్తుతం ఇథనాల్ తయారీకి పెరిగిన డిమాండ్ కారణంగా దేశీయ అవసరాల కోసం దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆహార అవసరాల కంటే ఇంధన ఉత్పత్తికి పంటలను మళ్లించడం దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

బ్రెజిల్‌తో భారత్‌ను పోల్చడం సరికాదు

ఇథనాల్ వినియోగంలో బ్రెజిల్‌ను భారత్‌తో పోల్చడం సరైనది కాదని నిపుణులు అంటున్నారు. బ్రెజిల్‌లో విస్తారమైన భూమి, తక్కువ జనాభా, భారీ చెరకు ఉత్పత్తి ఉండటంతో అక్కడ ఇథనాల్ ఆధారిత ఇంధన విధానాన్ని అమలు చేయడం సులభమని చెబుతున్నారు.

అయితే భారత్‌లో జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావంతో భవిష్యత్తులో పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ-10 విధానమే మేలంటున్న నిపుణులు

మరోవైపు, ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వల్ల వాహనాల మైలేజ్ తగ్గడం, కొన్ని విడిభాగాల అరుగుదల పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ-20కు బదులుగా గతంలో అమల్లో ఉన్న ఈ-10 విధానాన్ని కొనసాగించడం మంచిదని సూచిస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తి సంస్థలకు అవసరమైన పరిహారం అందించినా, రైతులు, వినియోగదారులు, పర్యావరణ ప్రయోజనాలను కాపాడటం ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు.