జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఇక వందే మాతరం అవమానించినా మూడేళ్ల వరకు జైలు

D News: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం ‘వందే మాతరం’కు సంబంధించిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో జాతీయ గీతం ‘జన గణ మన’కు ఉన్న చట్టపరమైన రక్షణనే జాతీయ గీతం ‘వందే మాతరం’కూ కల్పించినట్లైంది.

పార్లమెంట్ గత నెలలో ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026’ను ఆమోదించింది. ఈ బిల్లు 1971 నాటి ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం’లో మార్పులు చేస్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది.

కొత్త చట్టం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా వందే మాతరం ఆలాపనను అడ్డుకోవడం లేదా దానిని పాడుతున్న సభకు అంతరాయం కలిగించడం నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

ఇంతకుముందు ఈ చట్టం జాతీయ గీతమైన ‘జన గణ మన’ను ఆలపించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆలపిస్తున్న సభకు అంతరాయం కలిగించడాన్ని మాత్రమే నేరంగా పరిగణించేది. అయితే జాతీయ గీతానికి ఉన్న స్థాయి చట్టపరమైన రక్షణ వందే మాతరానికి ఉండేది కాదు.

వందే మాతరానికి సమాన హోదా

స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ‘వందే మాతరం’ను జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలని రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న పేర్కొన్న విషయాన్ని బిల్లులో ప్రస్తావించారు.

బంకించంద్ర ఛటర్జీ రచించిన వందే మాతరం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల జాతీయ గీతంతో సమానంగా దీనికి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వివరించింది.

స్వాతంత్ర్య వేడుకల్లో వందే మాతరం

ఇదిలా ఉండగా, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఎర్రకోట ప్రాకారాల నుంచి వందే మాతరం ఆలపించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

అంతేకాకుండా, వందే మాతరం, జన గణ మన రెండింటినీ ఒకే కార్యక్రమంలో ఆలపించాల్సి వస్తే ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించాలని హోంశాఖ ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 28న జారీ చేసిన మార్గదర్శకాల్లో వందే మాతరం ఆరు చరణాలను ఆలపించేందుకు సుమారు 3 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని పేర్కొంది.

రాష్ట్రపతి రాక, జాతీయ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతానికి సంబంధించిన నియమాలను పాటించాలని సూచించింది.

అదేవిధంగా, పాఠశాలల్లో రోజువారీ కార్యక్రమాలను సామూహికంగా వందే మాతరం ఆలపించడంతో ప్రారంభించాలని హోంశాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.