
D News: Aug 10: మాజీ ఎమ్మెల్యే విగ్రహ గద్దె కూల్చివేత.. నర్సంపేటలో కలకలం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపల్ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. ఈ ఘటనతో నర్సంపేటలో రాజకీయంగా తీవ్ర చర్చ మొదలైంది.
సొంత స్థలంలో విగ్రహ ఏర్పాటు కోసం పనులు
గత వారం రోజులుగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి తన సొంత భూమిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిపూజ నిర్వహించి, గద్దె నిర్మాణ పనులను చేపట్టారు. పనులు కొనసాగుతుండగానే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని నిర్మాణాన్ని తొలగించారు.
అనుమతులు లేవంటూ కూల్చివేత
ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పటికీ ముందస్తు అనుమతులు తీసుకోలేదని పేర్కొంటూ మున్సిపల్ అధికారులు గద్దెను కూల్చివేసినట్లు సమాచారం. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రాత్రి సమయంలో కూల్చివేత చర్యలు చేపట్టడంపై స్థానికులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ కక్షసాధింపేనని బీఆర్ఎస్ ఆరోపణ
గద్దె కూల్చివేత ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అనుమతుల పేరుతో మున్సిపల్ అధికారులు అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ ఘటనపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, కూల్చివేతకు దారితీసిన కారణాలను వెల్లడించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
