భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ఈ సిరీస్‌పై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

‘బంగ్లాదేశ్‌ పర్యటన విషయంలో కేంద్రం అనుమతి తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీమిండియాను బంగ్లాదేశ్‌కు పంపాలా? వద్దా? అనే అంశంపై ఇప్పటివరకు చర్చ జరగలేదు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. సిరీస్‌ విషయంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మాకు లేఖ రాసింది. ప్రస్తుతం ఇరుబోర్డులు నిత్యం టచ్‌లోనే ఉన్నాయి’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

టీమిండియాకు భద్రత కల్పిస్తాం: బీసీబీ

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో సంబంధాలను తిరిగి మెరుగుపరుచుకునేందుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించిన నేపథ్యంలో ఇరుబోర్డుల మధ్య దూరం పెరిగినప్పటికీ.. ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహణకు బీసీబీ ఆసక్తి చూపుతోంది.

భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తే పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని బీసీబీ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ సయీద్ ఇబ్రహీం అహ్మద్ తెలిపారు. టీమిండియాతో సిరీస్‌ నిర్వహించేందుకు తమవైపు నుంచి ఎలాంటి అవకాశాన్నీ వదులుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం గతేడాది జూన్‌లోనే టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, అక్కడ నెలకొన్న అంతర్గత సంక్షోభం కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. అనంతరం సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు రీషెడ్యూల్‌ చేశారు.

టీ20 ప్రపంచకప్‌ బహిష్కరణతో ఆర్థికంగా నష్టపోయిన బీసీబీకి భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహణ కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌లో టీమిండియా తమ దేశంలో పర్యటించాలని బీసీబీ కోరుకుంటోంది. భారత జట్టుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సెక్యూరిటీ కమిటీ చైర్మన్ సయీద్ ఇబ్రహీం అహ్మద్ ప్రకటించారు.

అయితే, బీసీసీఐ తదుపరి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ అనుమతిపైనే ఆధారపడి ఉండనుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే బంగ్లాదేశ్‌ పర్యటనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది

By Ramya