
‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. ఇక వరుస పరాజయాల తర్వాత కొంత విరామం తీసుకున్న ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇప్పుడు ఓ భారీ డిజిటల్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.
‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ, గ్లామరస్ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ఆసక్తికరమైన బ్యాంక్ హీస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోసం నిర్మిస్తున్నట్లు సమాచారం.
తెలుగు ఓటీటీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లలో ఇది ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌తో మీనాక్షి చౌదరి తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటివరకు సినిమాల్లో గ్లామర్ పాత్రలకు పరిమితమైన ఆమె.. ఈ సిరీస్‌లో పూర్తిగా భిన్నమైన క్యారెక్టర్లో కనిపించనున్నట్లు సమాచారం.
సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటాయని టాక్. కథ, కథనం విషయంలోనూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ ఈ సిరీస్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత వెంకీ అట్లూరి ఈ ఓటీటీ ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ బ్యాంక్ హీస్ట్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
