
అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గిరిజనుల బతుకుల్లో చీకట్లు నింపుతున్న
అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, గిరిజనుల భూములను బలవంతంగా సేకరిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలోని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం పచ్చని పొలాలను సేకరించడంతో భూమినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజన కుటుంబాల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం, ఇండ్ల స్థలాలు, ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. భూసేకరణతో నిర్వాసితులైన వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతున్నదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే భూములు కోల్పోయిన గిరిజనులు, రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేస్తున్న కాలనీలోని ప్లాట్లపైనా వివాదం మొదలైంది. దాదాపు 93 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న నిర్వాసితుల కాలనీలో విలువైన, ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్లను కొందరి ప్రయోజనాల కోసం బ్లాక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు నిర్మించేందుకు నిర్వాసితుల పేరుతోనే స్థలాలను కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండస్ట్రియల్ పార్క్‌తోపాటు శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు సమీపంలోని ప్లాట్లపైనా కొందరి కన్ను పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు భూసేకరణ పూర్తయినప్పటికీ పలువురు రైతులకు ఇంకా పరిహారం అందలేదని ఆక్షేపణలు ఉన్నాయి. దీనిపై నిరసనలు చేపడుతున్న వారిని అణచివేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లగచర్ల పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నదని స్థానికులు చెప్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట గ్రామ సమీపంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏర్పాటు చేస్తున్న నిర్వాసితుల కాలనీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లే అవుట్లో ప్రైమ్ లొకేషన్లన్నీ బ్లాక్?
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, రోటిబండ తండా, పులిచర్ల తండా, ఈర్లపల్లి తదితర గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,300 ఎకరాల భూమిని సేకరిస్తున్నది. ఇందులో దాదాపు 80 శాతం భూసేకరణ పూర్తయినట్టు సమాచారం. మిగిలిన భూమి సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది.
