తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతరంగా కొనసాగుతుందని, ఇందుకు ఎలాంటి గడువు తేదీ లేదని అధికారులు స్పష్టం చేశారు.

‘చేయూత’ పథకం ద్వారా ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా (బోదకాలు) బాధితులు, డయాలసిస్ రోగులకు పింఛన్లు అందించనున్నారు. అలాగే దివ్యాంగుల కేటగిరీలో థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు ప్రాధాన్యత ఆధారంగా పింఛన్లు మంజూరు చేయనున్నారు.

పింఛన్‌కు ఆదాయ పరిమితి

పింఛన్ పొందేందుకు అర్హత సాధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

అదే విధంగా 3 ఎకరాలకు మించి మాగాణి భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. నాలుగు చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలు కలిగినవారు, ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వ్యాపారులు, ఆస్తిపరులు కూడా పింఛన్‌కు అనర్హులుగా అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇతర పింఛన్లు లేదా స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ పొందుతున్న వారికి ‘చేయూత’ పథకం వర్తించదు.

ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు

గతంలో ‘చేయూత’ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే తమ దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో ఉందా లేదా అనే విషయాన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల వద్ద తెలుసుకోవాలని సూచించారు.

కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ‘చేయూత’ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, వివరాలను పూర్తి చేసి సంబంధిత అధికారులకు అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు లేదా మున్సిపల్ కమిషనర్లకు ఫారాలను అందజేయాల్సి ఉంటుంది.