
నమస్తే అమ్మా.. నేను కేటీఆర్‌ను. మీ సమస్య గురించి విజిత్ నాకు చెప్పిండు. నేనున్నా..” అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విదేశాల్లో రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు ఫోన్‌లో ధైర్యం చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన నరెడ్ల సతీశ్ రెండేండ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జూలై 29న షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. ఎడమ చేయి, కుడి కాలుకు ఫ్రాక్చర్లు అయినట్లు వైద్యులు గుర్తించారు. మరుసటి రోజు శస్త్రచికిత్స చేశారు. చికిత్సకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో వారు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావును సంప్రదించారు. విజిత్‌రావు ద్వారా ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో విజిత్‌రావు శుక్రవారం నర్సాపూర్ గ్రామానికి చేరుకుని సతీశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం బాధితుడి భార్య భవాని, తండ్రి రామన్నను కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు.
ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పి, కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమకు అండగా నిలిచిన కేటీఆర్‌కు భవాని, రామన్న కృతజ్ఞతలు తెలిపారు.
