
D News: Aug 8: మరో 5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో కీలకమైన రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని మరో 5 లక్షలకు పైగా పేద కుటుంబాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. తుది ఆమోదం కోసం సంబంధిత ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపించారు. ఆర్థిక శాఖ నుంచి అధికారిక అనుమతులు లభించి, అవసరమైన నిధులు విడుదలైన వెంటనే కొత్త లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ అందించనున్నారు.
ప్రస్తుతం 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి
ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42.90 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సబ్సిడీ ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో సుమారు 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి, తొలి విడతలో 42.90 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి గ్యాస్ సబ్సిడీ రీయింబర్స్‌మెంట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో రూ.723.30 కోట్లను కేటాయించింది.
కొత్త రేషన్ కార్డులతో మరింత మందికి అవకాశం
రాష్ట్రంలో 1.20 కోట్లకు పైగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీని ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన కుటుంబాలకే పరిమితం చేశారు. అయితే వివాహం తర్వాత కొత్తగా వేరు కాపురం పెట్టిన కుటుంబాలకు రేషన్ కార్డులు లేకపోవడం, ఒకే ఇంట్లో వేర్వేరుగా నివసిస్తున్న కుటుంబాలకు ఒకే రేషన్ కార్డు ఉండటం వంటి కారణాలతో పలువురు అర్హులు ఈ పథకానికి దూరమయ్యారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2025 జనవరి నుంచి 2026 జూలై మధ్య కాలంలో అర్హులైన పలువురికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
త్వరలో కొత్త లబ్ధిదారుల జాబితా
కొత్తగా అందిన దరఖాస్తులను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి, మరో 5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ నుంచి తుది అనుమతి లభించిన తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త లబ్ధిదారుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హత పొందిన కొత్త కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సదుపాయం అందనుంది. సబ్సిడీ మొత్తాన్ని నిబంధనల ప్రకారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా ప్రయోజనం పొందే కుటుంబాల సంఖ్య మరింత పెరగనుంది.
