D News: Aug 7: వరుడు కళ్యాణి: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం బిల్లును వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల భద్రతకు సంబంధించిన కీలక చట్టాన్ని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని ఆమె విమర్శించారు.

రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ అంశంపై స్పందించకపోవడాన్ని వరుదు కల్యాణి ప్రశ్నించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాన్ని రద్దు చేస్తుంటే మౌనంగా ఉండకుండా, తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

దిశ చట్టం పేరు మార్చినా తమకు అభ్యంతరం లేదని, కానీ మహిళల రక్షణ కోసం ఆ చట్టాన్ని కొనసాగించాలని వరుదు కల్యాణి కోరారు. చట్టాన్ని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.