
D News: Aug 7: వరుణ యాగం: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండుకుండలుగా మారాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ‘వరుణ యాగం’ నిర్వహించనుంది. సీఎం సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు సమావేశమై ఈ నెల 10వ తేదీ (ఆగస్టు 10)ను వరుణ యాగానికి శుభ ముహూర్తంగా నిర్ణయించారు.
ఈ ఆధ్యాత్మిక క్రతువును నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలో ఉన్న ‘విజయవిహార్’ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని, నీటి వనరులు సమృద్ధిగా నిండాలని సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వరుణ యాగం విశేషాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహించాలని, రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రైతులకు సాగునీటి కొరత లేకుండా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని సంకల్పిస్తూ వైదిక సంప్రదాయాల ప్రకారం శాస్త్రోక్తంగా వరుణ యాగాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
