
D News: Aug 6: తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు Air India శుభవార్త తెలిపింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. తిరుపతితో పాటు మరో ఐదు నగరాలకు కూడా కొత్త దేశీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తాజా నెట్వర్క్ విస్తరణలో భాగంగా తిరుపతితో పాటు ఔరంగాబాద్, కోయంబత్తూర్, జామ్నగర్, జోధ్పూర్, మదురై నగరాలకు కూడా కొత్త విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ కొత్త సేవలు 2026 సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఈ విస్తరణతో దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార, పారిశ్రామిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా 48 దేశీయ, 16 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తూ తన నెట్వర్క్ను విస్తరిస్తోంది.
కొత్త సర్వీసుల ద్వారా ఈ ఆరు నగరాలను చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన మెట్రో నగరాలతో అనుసంధానం చేయనున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు మరిన్ని కనెక్టివిటీ అవకాశాలు లభించడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా రోజుకు 500కు పైగా విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. సంస్థ వద్ద 100కు పైగా విమానాలు సేవలందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో, మరింత సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తిరుపతికి చేరుకుంటారు. ఇప్పటివరకు ఎక్కువ మంది రైలు, రోడ్డు మార్గాలను ఆశ్రయిస్తుండగా, ఇటీవలి కాలంలో విమాన ప్రయాణాన్ని ఎంచుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త విమాన సర్వీసులు భక్తులతో పాటు ఇతర ప్రయాణికులకు కూడా మరింత ప్రయోజనకరంగా మారనున్నాయి.
