
D News: Aug 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనుల ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా కుంకుమపువ్వు సాగు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు మాత్రమే పరిమితమైన ఈ విలువైన సుగంధ ద్రవ్య పంటను ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కిలో కుంకుమపువ్వు మార్కెట్ ధర లక్షల్లో ఉండటంతో ఈ పంట గిరిజన రైతులకు అధిక ఆదాయాన్ని అందించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక విలువ కలిగిన పంటలను ప్రోత్సహించడం ద్వారా గిరిజన కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
చింతపల్లి, లంబసింగి పరిసర ప్రాంతాల్లో శీతాకాలంలో నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రతలు కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పాంపోర్ ప్రాంత వాతావరణాన్ని పోలి ఉంటాయని వ్యవసాయ నిపుణులు గుర్తించారు. అంతేకాకుండా అక్కడి నేలలోని తేమ, సారవంతమైన మట్టి కుంకుమపువ్వు దుంపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయని ప్రాథమిక సర్వేల్లో తేలినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం కాశ్మీర్ నుంచి నాణ్యమైన కుంకుమపువ్వు విత్తన దుంపలను తెప్పించి రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కాశ్మీర్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సాగు పద్ధతులు, పంట సంరక్షణ, దిగుబడి సేకరణ వంటి అంశాలపై గిరిజన రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా కుంకుమపువ్వు సాగును విస్తరించేందుకు ఉద్యానవన శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా స్థానిక గిరిజనులకు శాశ్వత ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి ఆదాయ వనరులు కూడా విస్తరించే అవకాశం ఉంది.
ఒకప్పుడు వివాదాస్పద పంటల సాగుతో గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో ఇప్పుడు అధిక విలువ కలిగిన కుంకుమపువ్వు సాగు ప్రారంభం కావడం చారిత్రాత్మక మార్పుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు లభించే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
