
D News: Aug 6: డీమార్ట్ (D Mart) ప్రస్తుతం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యమైన షాపింగ్ కేంద్రంగా మారింది. ఇంట్లో పప్పులు, బియ్యం, వంట నూనె లేదా ఇతర నిత్యావసర వస్తువులు అయిపోతే “డీమార్ట్‌కు వెళ్లాలి” అనే మాట చాలామంది ఇళ్లలో వినిపిస్తోంది. తక్కువ ధరల్లో నాణ్యమైన నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు అందించడం వల్లే డీమార్ట్ తక్కువ కాలంలోనే వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో పాటు పలు పట్టణాల్లో డీమార్ట్ స్టోర్లు అందుబాటులో ఉన్నాయి. ఏ సమయంలో వెళ్లినా స్టోర్లు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభించడం, ఇతర మార్కెట్లతో పోలిస్తే తక్కువ ధరలు ఉండటం వల్లే ఎక్కువ మంది డీమార్ట్‌ను ఎంపిక చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
రాఖీ పండుగ సందర్భంగా డీమార్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్టోర్లలో రాఖీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆకర్షణీయమైన డిజైన్లు, సంప్రదాయ రాఖీలు, కార్టూన్ థీమ్ రాఖీలు వంటి అనేక రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే పండుగ సందర్భంగా ప్రత్యేక స్వీట్లను కూడా విక్రయిస్తోంది.
ఇదే సమయంలో ఈ నెలలో జరగనున్న వరలక్ష్మి వ్రతాన్ని దృష్టిలో ఉంచుకుని పూజా సామగ్రిని కూడా డీమార్ట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో పండుగకు అవసరమైన అన్ని వస్తువులను ఒకే చోట కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు కలుగుతోంది.
డీమార్ట్ వ్యవస్థాపకుడు Radhakishan Damani 2002లో ముంబైలో తొలి డీమార్ట్ స్టోర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం కంపెనీ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 10 రాష్ట్రాల్లో 415 స్టోర్లను నిర్వహిస్తూ రూ.57,790 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
డీమార్ట్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి తక్కువ ఖర్చుతో వ్యాపారాన్ని నిర్వహించే విధానం. అందుకే డీమార్ట్ స్టోర్లలో ఖరీదైన మార్బుల్ ఫ్లోర్లు, ఆకర్షణీయమైన ఇంటీరియర్లు లేదా అధిక వ్యయంతో కూడిన లైటింగ్ కనిపించవు. అవసరమైన సౌకర్యాలకే ప్రాధాన్యం ఇస్తూ ఖర్చులను నియంత్రించడం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరల్లో వస్తువులు అందిస్తోంది.
ఇతర రిటైల్ సంస్థలు ఖరీదైన మాల్స్‌లో దీర్ఘకాలిక లీజులపై స్టోర్లు ప్రారంభించిన సమయంలో, రాధాకిషన్ దమానీ భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారు. ఎక్కువ శాతం డీమార్ట్ స్టోర్లను సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయడం ద్వారా అద్దె ఖర్చులను తగ్గించి, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు తక్కువ ధరల రూపంలో అందిస్తున్నారు. ఈ వ్యాపార నమూనానే డీమార్ట్‌ను దేశంలోని ప్రముఖ రిటైల్ చైన్‌లలో ఒకటిగా నిలబెట్టింది.
