
D News: Aug 4: ప్రముఖ విద్యావేత్త, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాజీ గవర్నర్ డాక్టర్ డి.వై. పాటిల్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
1935 అక్టోబర్ 22న మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పన్హాలా తాలూకా కొల్హోలీ గ్రామంలో జన్మించిన డాక్టర్ డి.వై. పాటిల్ విద్యా రంగ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఉన్నత విద్యను మరింత విస్తృత స్థాయిలో అందించాలనే లక్ష్యంతో ‘డి.వై. పాటిల్ గ్రూప్’ను స్థాపించి దేశవ్యాప్తంగా విద్యాసంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఆయన ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాల్లో విద్యను అందించే 182కు పైగా విద్యాసంస్థలు, ఏడు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ సంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం పొందారు.
ప్రజాసేవలో భాగంగా డాక్టర్ డి.వై. పాటిల్ త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా 2009 నుంచి 2012 వరకు, బీహార్ గవర్నర్‌గా 2012 నుంచి 2014 వరకు సేవలందించారు. అలాగే పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించి తన పరిపాలనా అనుభవాన్ని చాటుకున్నారు.
విద్యా, సామాజిక రంగాల్లో ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1991లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. విద్యా విస్తరణకు ఆయన అందించిన సేవలు, స్థాపించిన విద్యాసంస్థలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
