
D News: Aug 4: కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF)పై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) లేదా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను గణనీయంగా పెంచింది. సవరించిన నిబంధనల ప్రకారం పెట్రోల్ ఎగుమతిపై పన్నును లీటరుకు రూ.2.50 నుంచి రూ.3.50కు పెంచగా, డీజిల్‌పై లీటరుకు రూ.15.50 నుంచి రూ.25.50కు పెంచింది. అలాగే ఎయిర్‌క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.14.50 నుంచి రూ.22కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో అధిక లాభాల కోసం దేశీయ చమురు శుద్ధి సంస్థలు (రిఫైనరీలు) పెద్ద ఎత్తున ఇంధనాన్ని ఎగుమతి చేయడాన్ని నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఎగుమతులపై అధిక పన్ను విధించడం ద్వారా కంపెనీలు విదేశాలకు ఇంధనాన్ని పంపడం కంటే దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
ఈ నిర్ణయం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన కొరత తలెత్తకుండా తగిన నిల్వలు అందుబాటులో ఉండటంతో పాటు, దేశీయ మార్కెట్లో ధరల స్థిరత్వాన్ని కాపాడేందుకు కూడా ఈ చర్య దోహదపడుతుందని విశ్లేషిస్తున్నారు.
