
D News: Aug 3: శ్రీశైల క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం మరింత సులభంగా కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ దర్శన విధానంలో పలు మార్పులు అమలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ఉదయం మరియు మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనాలను నిలిపివేశారు. ఈ మూడు రోజుల్లో రాత్రి సమయంలో మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మాత్రం మూడు పూటలా యథావిధిగా స్పర్శ దర్శనాలు కొనసాగుతాయని వెల్లడించారు. అలాగే శ్రావణమాస ప్రత్యేక సందర్భాల్లో ప్రతి శుక్రవారం రాత్రి మాత్రమే స్పర్శ దర్శనాలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సమయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రోటోకాల్ దర్శనం కోరే భక్తులు తమ అధికారిక సిఫార్సు లేఖలను ప్రయాణానికి కనీసం రెండు రోజుల ముందే దేవస్థానానికి పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారిక ఈ-మెయిల్ చిరునామా protocol@srisailadevasthanam.org లేదా ప్రోటోకాల్ వాట్సాప్ నంబర్ 9160016215 ద్వారా డిజిటల్ రూపంలో పంపించాలని సూచించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సిఫార్సు లేఖల ఆధారంగా కేటాయించే ప్రోటోకాల్ దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని అమలు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు వస్తుండటంతో స్పర్శ దర్శనానికి ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రత్యేక రోజుల్లో అభిషేకాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా నిలిపివేసి సాధారణ అలంకార దర్శనాలను మాత్రమే నిర్వహిస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం వసతి గదులు, ఆర్జిత సేవా టికెట్లను ఆలయ అధికారిక వెబ్‌సైట్, దేవాదాయ శాఖ వెబ్‌సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా ముందుగానే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఎక్కువసేపు వేచి ఉండే భక్తులకు దేవస్థానం తరఫున వేడి పాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం వంటి సౌకర్యాలను నిరంతరం అందిస్తున్నారు. సామాన్య భక్తులందరికీ స్వామివారి దర్శనం సజావుగా జరిగేలా చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు దేవస్థానం సూచనలను పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని, తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు.
