
D News: Aug 3: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన తొలి ప్రోమో ద్వారా ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగనున్నట్లు స్పష్టమైంది. సెప్టెంబర్ నెలలో షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా, కొత్త సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఒకప్పటి ప్రముఖ హీరో అబ్బాస్ బిగ్‌బాస్ తెలుగు 10లో పాల్గొననున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్, కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అనంతరం మళ్లీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ వేదికపై కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే అబ్బాస్‌ను సంప్రదించగా, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై బిగ్‌బాస్ యాజమాన్యం గానీ, అబ్బాస్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అబ్బాస్ నిజంగానే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో అడుగుపెడతారా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.
