D News: Aug 1: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరును ప్రశంసించినట్లు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణానికి సిద్ధమైన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆప్యాయంగా నారా లోకేశ్‌తో మాట్లాడి, “శెభాష్ లోకేశ్, చాలా బాగా పనిచేస్తున్నావు” అంటూ అభినందించినట్లు సమాచారం. అలాగే ఆయన భుజం తట్టి, ఇదే ఉత్సాహం, అంకితభావంతో ప్రజాసేవలో ముందుకు సాగాలని సూచించినట్లు పేర్కొన్నారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల అమలులో మంత్రి లోకేశ్ పాత్రను ప్రధాని అభినందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనల నిర్వహణలో, అలాగే ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి రికార్డు స్థాయిలో పాల్గొనేవారిని సమీకరించిన సందర్భంగా నారా లోకేశ్ కృషిని ప్రధాని మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన పనితీరుపై ప్రధాని ప్రశంసలు వ్యక్తం చేసినట్లు వెల్లడికావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.