
D Spiritual: Jul 30: శ్రీశైలం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు: శ్రీశైలం దేవస్థానం ఆన్‌లైన్ వెబ్‌సైట్, మనమిత్ర యాప్ ద్వారా టికెట్ల బుకింగ్ చేసుకునే భక్తులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రావణ మాస దర్శనాలు, ప్రత్యేక పూజల కోసం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులకు సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. వెబ్‌సైట్ సరిగా పనిచేయకపోవడంతో యాత్రికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యకు ప్రధాన కారణం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న 9 అండ్ 9 సంస్థపై అధికారులు ఆంక్షలు విధించడమేనని సమాచారం. 2021 నుంచి ఈ సంస్థ వెబ్‌సైట్ రూపకల్పనతో పాటు ఆన్‌లైన్ టికెట్ల జారీ బాధ్యతలను నిర్వహిస్తోంది. అయితే ప్రస్తుతం నిర్వహణ బాధ్యతల మార్పు ప్రక్రియలో భాగంగా సర్వర్ లోపాలు తలెత్తడంతో టికెట్ల బుకింగ్ సేవలు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కొత్తగా టీఎంఎస్ సంస్థ ద్వారా ఆన్‌లైన్ టికెట్ల జారీ సేవలను ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే గతంలో టీఎంఎస్ సంస్థ నిర్వహణలో టికెట్ల విక్రయాలు, రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్పుల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని యాత్రికులు కోరుతున్నారు.
