
D Entr: Jul 15: ప్రముఖ దివంగత నటుడు కోట శ్రీనివాసరావు తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్లో చేసిన విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ ప్రస్థానంతో పాటు పలువురు స్టార్ హీరోలతో తన అనుబంధంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లి సినిమా అవకాశాలు అడగలేదని చెప్పారు. అయితే కరోనా సమయంలో పనులు లేక ఇంటికే పరిమితం కావడం తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందన్నారు. దాదాపు 38 ఏళ్ల పాటు ప్రతిరోజూ వందలాది మంది మధ్య గడిపిన తనకు ఒక్కసారిగా ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా మారిందని తెలిపారు.
ఆ సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి. వినాయక్ వంటి హీరోలు, దర్శకులతో సరదాగా మాట్లాడేటప్పుడు “ఏదైనా పాత్ర ఉంటే చెప్పండి” అని చెప్పేవాడినని ఆయన వెల్లడించారు. అది అవకాశం కోసం ఒత్తిడి చేయడం కాదని, సరదా సంభాషణలో భాగంగానే ఆ మాటలు చెప్పానని వివరించారు.
ఇదే ఇంటర్వ్యూలో తనను తీవ్రంగా కలిచివేసిన ఓ సంఘటనను కూడా గుర్తుచేసుకున్నారు. ఒక బంధువును పరామర్శించడానికి అపోలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో, కొందరు తన ఆరోగ్యం విషమించిందంటూ, మరికొందరు తన మరణంపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నిరాధార ప్రచారాలు చేయడం బాధాకరమని, వయస్సు పెరిగిన తర్వాత ఆరోగ్య సమస్యలు రావడం సహజమేనని అన్నారు.
కొంతమంది తన వయస్సు, తన నేరుగా మాట్లాడే స్వభావం కారణంగా తనతో పనిచేయడానికి సంకోచించి ఉండొచ్చని కూడా కోట శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జీవితంలో ఎవరికి ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా జీవించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.
తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి నటుడిగా ఎదిగి పద్మశ్రీ పురస్కారం అందుకోవడం జీవితంలో గొప్ప విజయంగా భావిస్తున్నానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనకు వచ్చిన అత్యధిక పారితోషికం లక్షా యాభై వేల రూపాయలేనని, సంపాదించిన దానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. మనిషికి ఎంత ఉందన్నదానికంటే, ఉన్నదానితో సంతోషంగా ఉండటమే గొప్ప సంపద అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
