
D Tech: Jul 10: కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ చెల్లింపుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని తీసుకురావడానికి సరికొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఏఐ ఏజెంట్ల ద్వారా వినియోగదారుల అనుమతితో యూపీఐ చెల్లింపులు జరిగేలా కొత్త ప్రోటోకాల్‌ను రూపొందిస్తోంది. డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతంగా, సులభంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. మెట్రో నగరాల్లోని షాపింగ్ మాల్స్ నుంచి గ్రామాల్లోని చిన్న దుకాణాల వరకు దాదాపు ప్రతిచోటా యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వినియోగదారులు స్వయంగా మొత్తం నమోదు చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. అయితే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారుడి ముందస్తు అనుమతితో ఏఐ ఏజెంట్ కొన్ని చెల్లింపులను స్వయంచాలకంగా పూర్తి చేయగలదు.
ఈ వ్యవస్థ కోసం ఎన్పీసీఐ ‘యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్’ (Unified Agent Protocol)ను అభివృద్ధి చేస్తోంది. ప్రముఖ టెక్నాలజీ కంపెనీల సహకారంతో రూపొందిస్తున్న ఈ ప్రోటోకాల్ ద్వారా చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలను ఏఐ నిర్వహించగలదు. దీనివల్ల వినియోగదారుల సమయం ఆదా కావడంతో పాటు, ప్రతి నెల చెల్లించాల్సిన బిల్లులు ఆలస్యం కాకుండా చెల్లించే అవకాశం ఉంటుంది.
అయితే అన్ని రకాల లావాదేవీలను ఏఐ నిర్వహించదు. విద్యుత్ బిల్లులు, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లులు, ట్యూషన్ ఫీజులు, గ్యాస్ సిలిండర్ చెల్లింపులు వంటి నెలవారీ స్థిర ఖర్చులను మాత్రమే ఏఐ ఏజెంట్ చెల్లిస్తుంది. ఇందుకు వినియోగదారుడు ముందుగానే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఎలాంటి చెల్లింపులు జరగవని ఎన్పీసీఐ స్పష్టం చేస్తోంది.
‘యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్’ పేరుతో రూపొందుతున్న ఈ ఫీచర్‌పై ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు, ప్రముఖ సంస్థల నుంచి ఎన్పీసీఐ సూచనలు స్వీకరించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా వినియోగదారులు ఎప్పటిలాగే సాధారణ యూపీఐ చెల్లింపులు కొనసాగించవచ్చు. అయితే ఏఐ సహాయంతో చిన్న మొత్తాల, పునరావృతమయ్యే చెల్లింపులు మరింత సులభంగా పూర్తవుతాయి. ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకురానున్నారనే విషయంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
