
D Spiritual: Jan 31: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో భక్తుల తిరుగు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా బస్టాండ్ ప్రాంగణానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
ఆర్టీసీ అధికారులు ముందస్తుగా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల రద్దీని తట్టుకోలేక యంత్రాంగం చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా ప్రధాన మార్గమైన హన్మకొండ వైపు వెళ్లే కౌంటర్ల వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. గంటల పాటు ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకపోవడంతో వేచి చూసి విసిగిపోయిన భక్తుల సహనం నశించింది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆగ్రహించిన ప్రయాణికులు కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన తడకలను పీకేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
వేల సంఖ్యలో ఉన్న జనసందోహాన్ని నియంత్రించడంలో అటు పోలీసులు, ఇటు రవాణా శాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి చేయి దాటడంతో జాతర ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే ప్రయాణికుల సంఖ్య అంచనాలకు మించి ఉండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు సమర్థించుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా బస్సులు తిరిగి మేడారం చేరుకోవడంలో ఆలస్యం జరుగుతోందని, తక్షణమే అదనపు బస్సులను మళ్లించి భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు అదనపు సిబ్బందిని రంగంలోకి దించి, రాకపోకలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
