
DNews: Jan 22: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర బొగ్గు శాఖ అధికారుల ఇద్దరు సభ్యుల బృందం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సింగరేణి సందర్శించనుంది. ఈ బృందం టెండర్ రద్దుకు గల కారణాలు, వివాదం వెనుక ఉన్న అంశాలు, ఇతర సంబంధిత విషయాలను సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించనుంది. ఈ బృందంలో బొగ్గు శాఖ ఉప డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, సాంకేతిక డైరెక్టర్ మరపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ బృందానికి కేంద్రం మూడు రోజుల గడువు ఇచ్చింది. ఈ మూడు రోజుల్లో సింగరేణి పరిశీలన పూర్తి చేసి, నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు కారణాలపై నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఇదే సమయంలో, ఒడిశాలో నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలకు స్పందిస్తూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మరియు గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్క టెండర్లను రద్దు చేశారు. అదే విధంగా, సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కూడా నైనీ కోల్ మైన్ టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేసినట్లు ప్రకటించింది. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు (గురువారం) సాయంత్రం 5 గంటలకు బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, పరిపాలనా కారణాల వల్ల టెండర్లు రద్దు చేస్తున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు.

