
DNews: Dec 10: కుమారంమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరామేరి మండలంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న 12 గ్రామాలు మూడు దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. ఈ గ్రామాలపై ఇరురాష్ట్రాలు తమ అధికారం ఉందని వాదిస్తూ పాలన సాగిస్తున్నాయి. ఇక్కడి ప్రతి కుటుంబానికి రెండు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు జారీ అయ్యాయి, రెండు రాష్ట్రాలు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేశాయి, పాఠశాలలు కూడా రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఓటర్లకు రెండు రాష్ట్రాల నుంచి ఓటరు గుర్తింపు కార్డులు లభించాయి. ఒకే గ్రామంలో రెండు సర్పంచులు, రెండు ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు, రెండు ముఖ్యమంత్రులు ప్రతినిధులుగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. పరందోలి గ్రామంలో ఈ “డబుల్ ధమాకా” స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో తెలంగాణకు చెందిన సర్పంచ్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన ఉదాహరణ కూడా ఉంది.
1983లో కేంద్రం నియమించిన కె.కె. నాయుడు కమిషన్ ఈ గ్రామాల భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి, సంప్రదాయాలు, రవాణా సౌకర్యాలను పరిశీలించి పరందోలి పంచాయతీని విభజించి కొత్తగా అంతాపూర్ పంచాయతీ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పది గ్రామాలను అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కేంద్రానికి సూచించింది. కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి ఈ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని నిర్ణయించింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం గ్రామస్తుల మద్దతుతో కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం ఇంతవరకు పరిష్కారం కాలేదు.
ప్రస్తుతం ఈ గ్రామాల ప్రజలు ఏ రాష్ట్రానికి చెందినవారో స్పష్టత లేక అయోమయంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ సమస్య ముందుకు వస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లో ఇక్కడి ప్రజలకు రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేసే అవకాశం కల్పించారు. అందువల్ల వారికి రెండు రాష్ట్రాల ఓటరు కార్డులు ఉన్నాయి. ఈ నెల 11న జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికల మొదటి దశలో ఈ గ్రామాల్లో పోటీదారులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.
