
DNews: Dec 03: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మొదటి ప్లాట్‌ఫారంపై నల్లని సంచిని వదిలి వెళ్లిపోయాడు. ఆ సంచిలో ఉంచిన ఉల్లిపాయ ఆకారపు బాంబును ఒక వీధి కుక్క రైల్వే ట్రాక్‌పైకి లాగి కొరికింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ అకస్మాత్తు పేలుడు కారణంగా స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
స్థానికుల సమాచారం మేరకు కొత్తగూడెం 3వ టౌన్ పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌లో మరిన్ని బాంబులు ఉన్నాయేమోనని పోలీసులు అప్రమత్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు భాగంగా సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఎటు నుంచి వచ్చాడు, ఎటు వెళ్లాడు అన్న అంశాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఘటన పెద్ద ప్రమాదాన్ని తప్పించిందని స్థానికులు చెబుతున్నారు.
