
DNews : Dec 02: నల్గొండలో మరో రియల్ ఎస్టేట్ పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. భారీ లాభాలు వస్తాయని హామీ ఇచ్చిన ఒక సంస్థ దివాళా తీసింది. ఈ సంస్థ రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే ఒక ప్లాట్ భూమి, నెలకు రూ.16 వేల వడ్డీ 25 నెలల పాటు, చివరికి రూ.8 లక్షల నగదు ఇస్తామని చెప్పింది. కానీ కొంతమందికే వడ్డీ చెల్లించగా, రిజిస్ట్రేషన్ చేసిన భూమి చూపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. ఇదే సంస్థపై గతంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW)లో కేసు నమోదైన విషయం గమనార్హం.
రెండు సంవత్సరాల క్రితం కూకట్పల్లి, హైదరాబాద్‌లో “12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్” అనే కంపెనీ స్థాపించబడింది. అధిక వడ్డీ, లాభాల ఆశతో సాధారణ ప్రజలతో పాటు కొంతమంది ఉద్యోగులు, అధికారులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు. బాధితుల వాదన ప్రకారం ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.330 కోట్లను సేకరించింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం, రామసాగర్పల్లి ప్రాంతంలోని భూములకు బై నంబర్లు ఇచ్చి, ఒక్కో ప్లాట్‌కు రూ.100 బాండ్ పేపర్‌పై ఒప్పందాలు ఇచ్చారు. అయితే అవి నకిలీవని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ సంస్థ ఏజెంట్లు నల్గొండ జిల్లాలో 300 మందికి పైగా ప్రజలను ఈ పథకంలో చేర్చారు. కొంతమందికే వడ్డీ చెల్లించగా, రిజిస్ట్రేషన్ చేసిన భూమి చూపించకపోవడంతో బాధితులు జిల్లా కేంద్రంలో ఆందోళన చేసి, సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న రపోలు ప్రకాశ్ ఇంటి వద్ద నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రకాశ్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద సాయంత్రం వరకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. అనంతరం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వద్ద ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
