
DNews : Dec 01: నల్లబెల్లి, దుగ్గొండి, గీసుకొండ, సంగెం మండలాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు సమర్పించడంతో క్లస్టర్ కేంద్రాల్లో కొంత గందరగోళం నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయనున్న అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ల వద్ద నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు పూరించడంలో ఉన్న సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బాల మాయాదేవి ఆదివారం నల్లబెల్లి క్లస్టర్ కేంద్రాన్ని సందర్శించి, అభ్యర్థుల సందేహాలను అధికారులు స్పష్టంగా నివృత్తి చేయాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద నరక్కపేట, రుద్రగూడెం గ్రామాల్లోని క్లస్టర్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా ఎన్నికల పరిశీలకురాలు బాల మాయాదేవి, జిల్లా అదనపు కలెక్టర్ సంద్యారాణి దుగ్గొండి మండలంలోని శివాజీనగర్, వెంకటాపురం క్లస్టర్ కేంద్రాలను సందర్శించి హెల్ప్‌డెస్క్ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్శనల్లో సీఈఓ రామ్‌రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శుభ నివాస్ పాల్గొన్నారు.

