
DNews : Dec 01: హైదరాబాద్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేక MSME పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇది తమ ప్రభుత్వ సంకల్పమని, మహిళా సాధికారత తన లక్ష్యమని, మాటల్లో కాకుండా కార్యరూపంలో చూపిస్తున్నానని ఆయన అన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంలో మహిళలను కీలక భాగస్వాములుగా మార్చాలని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ సర్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘వి-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ సెరిమనీ’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. తెలంగాణలో మహిళా కార్మిక శక్తి పాల్గొనడం 52.7 శాతం ఉండగా, జాతీయ సగటు 45.2 శాతం మాత్రమే ఉందని, ఇది రాష్ట్ర పురోగతికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. ‘వి-హబ్’ ద్వారా మహిళలు కూడా విజయవంతంగా వ్యాపారాలు నడపగలరని నిరూపితమైందని, దీని ప్రేరణతో ‘వీ హబ్ 2.0’ ద్వారా మహిళా స్టార్టప్‌లను అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలుగా మార్చే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మహిళలు కొత్త ఆలోచనలతో ఉద్యోగాలను సృష్టించాలనే దృక్పథం కలిగి ఉండాలని ఆయన సూచించారు.
అదితి పథకం రాష్ట్రంలో అమలు కానుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, కొత్త ఆవిష్కరణలను తీసుకువస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ (అదితి)’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇచ్చిందని తెలిపారు. మెదక్ జిల్లాలోని ఫార్మా పరిశ్రమను మొదటి క్లస్టర్‌గా ఎంపిక చేసినందుకు BEE రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిందని ఆయన వివరించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో BEE మరియు EESL మీడియా సలహాదారు ఏ. చంద్రశేఖర రెడ్డి తయారు చేసిన ప్రత్యేక నివేదికను మంత్రి విడుదల చేశారు. MSMEలకు అదితి పథకం వరమని ఆయన ప్రశంసిస్తూ, దేశంలో అదితి అమలులో తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
