
DNews: Nov 22: సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం సింగూర్ ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏడు సభ్యుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. శనివారం ఈ కమిటీ సింగూర్ డ్యామ్‌ను ప్రత్యక్షంగా పరిశీలించింది. డ్యామ్‌ను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేయాలా లేదా కాపర్ డ్యామ్ నిర్మాణం ద్వారా పనులు చేపట్టాలా అన్న అంశంపై కమిటీ పరిశీలించింది. ఈ కమిటీలో ఓఎంసీ చైర్మన్ అంజాద్ హుస్సేన్, మిషన్ భగీరథ ఇఎన్సీ కృపాకర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ తదితరులు ఉన్నారు. ప్రాజెక్టు ఖాళీ చేస్తే మూడు జిల్లాల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టులో 16 టీఎంసీ నీరు నిల్వగా ఉండగా, అందులో 6 టీఎంసీ నీటిని విడుదల చేసి, 10 టీఎంసీ నిల్వతోనే మరమ్మతులు చేపట్టేలా సేద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో కమిటీ సాధ్యతనివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదివరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) డ్యామ్ దెబ్బతిన్నదని, తక్షణమే మరమ్మతులు చేయకపోతే ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం రూ.26 కోట్లు మరమ్మతుల కోసం, రూ.61.5 కోట్లు ఇతర పనుల కోసం మంజూరు చేసింది.
