
DNews:4 NOV:జోగులాంబ గద్వాల, నవంబర్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి పోలీస్ స్టేషన్ (KT Doddi PS)లో అక్రమ వసూళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. పాగుంట జాతర సందర్భంగా ఎస్ఐ, కానిస్టేబుల్ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమని తేల్చారు.
దీంతో ఎస్ఐ బీ. శ్రీనివాసులు, కానిస్టేబుల్ రజనీబాబును గద్వాల ఏఆర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇదే సమయంలో స్టేషన్ సీఐ ప్రమేయం ఉందా అన్న అంశంపై కూడా అంతర్గతంగా విచారణ కొనసాగుతోంది.
వివరాల ప్రకారం, పాగుంట వేంకటేశ్వర స్వామి జాతరలో వ్యాపారం చేసేందుకు వచ్చిన వారితో పోలీసు సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ రజనీబాబు తనను ఒక్కడినే బలిపశువుగా చేశారని, ఎస్ఐ ప్రేరణతోనే వసూళ్లు చేశానని వాదించాడు.
అతను ఎస్ఐ పేరు చెబుతూ వీడియో రికార్డ్ చేసి పోలీసు వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో బయటకు రాకముందే ఉన్నతాధికారులు దాన్ని డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.
