
DNews:29 OCT:కారేపల్లి, అక్టోబర్ : తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం అంజనాజపురం సమీపంలోని నిమ్మవాగు బ్రిడ్జి మీదుగా నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో పల్లిపాడు–ఏన్కూర్ మార్గంలో ఉన్న వంతెనపై పొంగిపొర్లుతున్న నీటిని లెక్కచేయకుండా ఒక డీసీఎం వాహనం డ్రైవర్ వాహనాన్ని దాటించే ప్రయత్నం చేశాడు. అయితే బ్రిడ్జి మధ్యలోకి వెళ్లగానే వాహనం ఆగిపోవడంతో అక్కడున్న స్థానికులు వాహనాన్ని వదిలి బయటకు రావాలని హెచ్చరించినా డ్రైవర్ వినలేదు.
కొద్ది సేపటికే ఉధృతమైన నీటి ప్రవాహం కారణంగా డీసీఎం వాహనం వంతెనపై నుంచి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే సమాచారాన్ని ఇచ్చిన అనంతరం రెవెన్యూ, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శోధనలు ప్రారంభించారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో వర్షం కొనసాగుతుండటంతో రక్షణ చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
