
DNews:29 OCT:కరీంనగర్: జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల్ డ్రెస్సెస్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే ఉన్న ఇతర షాపులకు వ్యాపించడంతో ప్రాంతం మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్ముకుంది.
ఈ ఘటనలో కపిల్ డ్రెస్సెస్, వినాయక ఎంటర్‌ప్రైజెస్, ఫోటోగ్రఫీ షాపు, కెనాన్ ఫోటోగ్రఫీ దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి. షాపుల్లోని బట్టలు, ఎలక్ట్రానిక్ సామగ్రి, ఫోటో యంత్రాలు మంటల్లో పూర్తిగా నాశనం అయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించిన తర్వాతే అగ్నిని అదుపులోకి తెచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే, కపిల్ షోరూమ్ యాజమాన్యానికి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
