
D Educt: Sept 15: ఏపీ టెట్-2026 ఫలితాలు విడుదల
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 16 వరకు మొత్తం 12 రోజుల పాటు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1,97,703 మంది అభ్యర్థులు హాజరై, మొత్తం 2,18,254 పేపర్లను రాశారు. వీరిలో 90,862 మంది అభ్యర్థులు 99,591 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. దీంతో మొత్తం 45.63 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి సెప్టెంబరు 13న ఒక ప్రకటనలో తెలిపారు.
ఇన్-సర్వీస్ టీచర్లలో 50.93 శాతం ఉత్తీర్ణత
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల విషయానికి వస్తే.. మొత్తం 74,711 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 72,288 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరు మొత్తం 81,127 పేపర్లను రాశారు. ఇందులో 37,789 మంది 41,315 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారు. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల్లో 50.93 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు.
తుది కీ ఆధారంగా ఫలితాలు
టెట్ పరీక్షల నిర్వహణ అనంతరం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తుది కీ ఆధారంగా టెట్-2026 ఫలితాలను విడుదల చేసినట్లు టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఫలితాలు ఇలా తెలుసుకోండి
అభ్యర్థులు తమ క్యాండిడేట్ లాగిన్ ద్వారా టెట్ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం tet2dsc.apcfss.in, cse.ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు. అలాగే 95523 00009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.
గత టెట్‌తో పోలిస్తే..
అక్టోబర్-2025లో నిర్వహించిన టెట్ పరీక్షలకు 31,886 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారిలో 15,239 మంది, అంటే 47.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత పరీక్షతో పోలిస్తే ఈసారి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం పెరిగింది.
