
DNews:1 NOV:హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా మరోసారి పంజా విసిరింది. నవంబర్ 1న ఉదయం సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపల్ పరిధి, పీజేఆర్ కాలనీ, మియాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు.
ప్రజావాణి ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసిన హైడ్రా బృందం, మియాపూర్లోని సర్వే నంబర్ 100లో సర్వే రికార్డులు మార్చి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 307, 308 నంబర్ల దొంగ రికార్డులు సృష్టించి హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించి ఐదంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం జరిపినట్లు తేలింది.
హైడ్రా, హెచ్ఎండీఏ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుని ఆ నిర్మాణాలను నేలమట్టం చేశారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇక అక్టోబర్ 31న హైడ్రా పోచారంలో రూ.30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో 4 వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేసి, ఆముదాల రమేష్ అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్లతో ఆ స్థలాన్ని 5 ప్లాట్లుగా విక్రయించినట్లు గుర్తించింది.
హైడ్రా అధికారులు తక్షణమే రంగంలోకి దిగి, పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
