
తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్–శేఖర్ మాస్టర్ మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన జానీ మాస్టర్ సస్పెన్షన్‌ను తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది.
డ్యాన్సర్స్ యూనియన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ఆధ్వర్యంలో అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌ను మినహాయించి మిగిలిన 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. సమావేశంలో జానీ మాస్టర్ వ్యవహార తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
హామీకి విరుద్ధంగా వ్యవహరించారంటూ..
గతంలో ఫిల్మ్ ఫెడరేషన్‌తో సమన్వయంగా పనిచేస్తానని జానీ మాస్టర్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని అనిల్ వల్లభనేని తెలిపారు. అయితే ఆ తర్వాత ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగానే సస్పెన్షన్‌ను తిరిగి అమలు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉపఎన్నికల నిర్వహణపైనా ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతల మండలి తదితర సినీ పెద్దలు చేసిన సూచనలను పక్కన పెట్టి అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించారని ఫెడరేషన్ వర్గాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.
కొత్త కార్యవర్గానికి సహకారం ఉండదా?
ఉపఎన్నికల ద్వారా ఏర్పడిన కొత్త కార్యవర్గానికి ఫిల్మ్ ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారం అందించబోమని సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే సాధారణ డ్యాన్సర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఫెడరేషన్‌ను సంప్రదిస్తే వారికి మాత్రం పూర్తి స్థాయిలో అండగా ఉంటామని వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్‌పై సస్పెన్షన్ మళ్లీ అమల్లోకి రావడంతో ఆయన తదుపరి కార్యాచరణపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో, ఫిల్మ్ ఫెడరేషన్–డ్యాన్సర్స్ యూనియన్ మధ్య విభేదాలు ఎలా పరిష్కారమవుతాయో చూడాలి.
