
DNews:08 Jan: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (మొకిల) పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ వద్ద గురువారం (జనవరి 8, 2026) తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. గతంలో భారీ ప్రమాదాలు జరిగిన అదే ప్రాంతంలో (Mirzaguda Gate) ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అతివేగంతో వెళ్తున్న ఒక స్పోర్ట్స్ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు రెండు ముక్కలైంది.ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరిని కర్గాయల సుమిత్ (20), శ్రీ నిఖిల్ (20), దేవాల సూర్య తేజ (20), మరియు బాల్మూరి రోహిత్ (18)గా గుర్తించారు.కారులో ఉన్న మరో విద్యార్థిని సుంకరి నక్షత్ర (20) తీవ్ర గాయాలతో బయటపడగా, ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
విద్యార్థులంతా నార్సింగి, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన వారు. కోకాపేట్లో ఒక స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ (ICFAI) విద్యార్థులు కాగా, ఒకరు ఎంజీఐటీ (MGIT) విద్యార్థి.సేమ్ స్పాట్ – వరుస ప్రమాదాలు: మీర్జాగూడ గేట్ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. గత ఏడాది నవంబర్లో ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువకముందే, ఇప్పుడు మరో నలుగురు విద్యార్థులు ఇక్కడే మృత్యువాత పడటం కలచివేస్తోంది.
