Trisha as Jayalalithaa in MGR Biopic? Director JM Basheer Reveals Casting Plans

D News : స్టార్ హీరోయిన్ త్రిషకు మరో ఆసక్తికరమైన అవకాశం దక్కనుందా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎంజీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో జయలలిత పాత్ర కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు నటుడు, దర్శక నిర్మాత జె.ఎం. బషీర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ పాత్రకు త్రిష ఇంకా అంగీకారం తెలిపినట్లు అధికారిక సమాచారం లేదు.

అక్టోబర్ 17 నుంచి ఎంజీఆర్ బయోపిక్ షూటింగ్?

‘పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్’ పేరుతో ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు జె.ఎం. బషీర్ సిద్ధమవుతున్నారు. గతంలో పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ జీవిత కథ ఆధారంగా ‘పసుంపొన్ దేవర్’ చిత్రాన్ని రూపొందించిన ఆయన.. ఇప్పుడు ఎంజీఆర్ జీవితాన్ని వెండితెరపై చూపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్ 17 నుంచి రామనాథపురంలో ప్రారంభం కానుందని వెల్లడించారు.

ఎంజీఆర్ బాల్యం, యవ్వనం, సినీ ప్రయాణం, రాజకీయాల్లో ఆయన ఎదుగుదల వంటి కీలక ఘట్టాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలిపారు. దర్శకుడు, సంగీత దర్శకుడికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

జయలలిత పాత్రకు త్రిషను సంప్రదించే ప్రయత్నం

ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండనుంది. అందుకే ఆ పాత్రలో త్రిష నటిస్తే బాగుంటుందని బషీర్ భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆమెను సంప్రదిస్తున్నామని వెల్లడించారు. అయితే త్రిష ఈ ప్రతిపాదనకు అంగీకరించారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

త్రిషతో తన కుమార్తెకు మంచి స్నేహం ఉందని, ప్రస్తుతం వారిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారని కూడా బషీర్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ బయోపిక్‌లో త్రిష భాగమవుతారా అన్న ఆసక్తి మొదలైంది.

అన్నాదురై, కరుణానిధి పాత్రలూ ఉంటాయా?

ఎంజీఆర్ జీవితంతో పాటు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పాత్రలు కూడా సినిమాలో ఉండనున్నట్లు బషీర్ వెల్లడించారు. అయితే ఆయా పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

సినిమా రంగంలో ఎంజీఆర్ సాధించిన విజయాలు, రాజకీయాల్లో ఆయన ఎదుగుదల, జయలలితతో ఉన్న అనుబంధాన్ని దర్శకుడు ఎలా ఆవిష్కరిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎంజీఆర్, జయలలిత పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా మారింది.

By Avinash