
D NEWS: శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) టన్నెల్ నిర్మాణంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భారత సైన్యానికి చెందిన ఇంజినీరింగ్ విభాగం నుంచి అదనపు అధికారుల సేవలను వినియోగించుకోనుంది.
న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత విభాగం ముగ్గురు లెఫ్టినెంట్ కర్నల్ల పేర్లను తెలంగాణ ప్రభుత్వ పరిశీలనకు పంపింది. లైఫ్టినెంట్ కర్నల్ సత్యదేవ్ సింగ్, లైఫ్టినెంట్ కర్నల్ రంజిత్ మీనన్, లైఫ్టినెంట్ కర్నల్ భల్లాను డిప్యూటేషన్‌పై తీసుకునే అవకాశాలున్నాయి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్‌ను కలిసి తెలంగాణకు అనుభవజ్ఞులైన ఆర్మీ ఇంజినీర్లను పంపాలని కోరారు. SLBC టన్నెల్‌లోని సాంకేతిక సవాళ్లు, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ అవసరాలను ఆయన వివరించారు.
సుమారు 44 కిలోమీటర్ల పొడవైన SLBC టన్నెల్లో ఇప్పటివరకు 35 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టన్నెల్ పనుల పర్యవేక్షణకు ఒక ఆర్మీ అధికారిని, బ్యారేజీల పునరుద్ధరణకు మరో ఇద్దరు అధికారులను కేటాయించే అవకాశం ఉంది.
ఆర్మీ ఇంజినీర్ల భాగస్వామ్యంతో పనుల్లో నాణ్యతా నియంత్రణ, సాంకేతిక పర్యవేక్షణ మెరుగుపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్మికుల భద్రత, ఇంజినీరింగ్ ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
