D NEWS: ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో హైదరాబాద్‌లో ఇండియా కూటమి నిర్వహించిన ‘సేవ్ డెమోక్రసీ’ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు భారీ ర్యాలీ చేపట్టారు.

నెక్లెస్ రోడ్ మీదుగా లోక్‌భవన్ వైపు కదిలిన కాంగ్రెస్, ఇండియా కూటమి, వామపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోక్‌భవన్‌కు చేరుకోకుండా పోలీసులు భారీ బారికేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనకారులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకుల అరెస్ట్ విషయం తెలియడంతో కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా అరెస్టయిన నాయకులు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారని వారు ఆరోపించారు. ‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని కూటమి నేతలు ప్రకటించారు.