D NEWS: ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంత్రులతో సమీక్ష అనంతరం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాస్త్రవేత్తల హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని సూచించారు.

వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగి, ఉత్పత్తి తగ్గిందని సీఎం తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. అవసరమైన విద్యుత్ కొనుగోలుకు కేంద్రం సహకరించాలని కోరనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ప్రస్తుతం సుమారు 290 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాగునీటి అవసరాలు పెరిగే నేపథ్యంలో నీటి వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వేసవిలో పంటలు వేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని రైతులను కోరారు.

వేసవి పంటలు వేయకపోవడం వల్ల ఉపాధి కోల్పోయే రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రకృతి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎల్‌నినో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. నోడల్ అధికారిగా కె. రామకృష్ణారావును నియమించినట్లు తెలిపారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.