D Educt: Sept 30: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఇటీవల వైద్య విద్య అదనపు సంచాలకులు (ADME)గా పదోన్నతి పొందిన తొమ్మిది మంది వైద్యులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు వైద్య విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల రేడియాలజీ ప్రొఫెసర్‌ పి. బుజ్జిబాబును పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. అదే కళాశాల టీబీసీడీ ప్రొఫెసర్‌ సునీల్‌ కుమార్‌కు పాడేరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కేజీహెచ్‌లో జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కె. రాంబాబును రాజమహేంద్రవరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు.

కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్డియోథొరాసిక్‌, వాస్కులర్‌ సర్జన్‌ ప్రొఫెసర్‌ సి. ప్రభాకరరెడ్డిని నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమించారు. అదే కళాశాల పాథాలజీ ప్రొఫెసర్‌ జి. బాలేశ్వరికి పిడుగురాళ్ల జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.

విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌ జి. పద్మశ్రీని మచిలీపట్నం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆనంద్‌కు పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు.

నెల్లూరు వైద్య కళాశాల బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కె. మాధవిని నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. అనంతపురం వైద్య కళాశాల అనస్థీషియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె. నవీన్‌కుమార్‌కు కడప జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులు ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత సమర్థంగా నిర్వహించాల్సి ఉంటుంది.